సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ
విశాఖపట్నంలో జరిగే సిఐటియు 18 వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో రవాణా రంగ కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31 నుండి 2026 జనవరి 4 వరకు జరుగుతాయని,జనవరి 4న కార్మిక వర్గ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా సిఐటియు ఐక్యత, పోరాటం నినాదాలుగా కార్మిక వర్గ హక్కులపై రాజీలేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. పాలకులు తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు.మహాసభలలో గత మూడు సంవత్సరాల కాలంలో కార్మిక హక్కులకై సాగించిన పోరాటాలు, విజయాలను సమీక్షించుకొని,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలైన కార్మికులకు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చడం,రవాణా రంగ కార్మికుల హక్కులకు తీవ్ర విఘాతం కలిగేలా తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టం- 2019,ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించడం,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం,కనీస వేతనాలు అమలు చేయకపోవడం,కార్మికుల ఉపాధికి హామీ ఇవ్వకపోవడం వంటి అనేక అంశాలను చర్చించి భవిష్యత్ కార్మిక వర్గ ఉద్యమానికి కీలక నిర్ణయాలు తీసుకొనున్నారని తెలిపారు.4వ తేదీన జరిగే బహిరంగ సభకు జిల్లాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రవాణా రంగ కార్మికులు అశోక్, దేవరాజ్,అడివి రాజు, రాముడు, బాలరాజు,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.