2027 జనగణన నిర్వహణపై అధికారులకు శిక్షణ
సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రాబోయే 2027 జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.బుధవారం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ మరియు విద్యాశాఖల అధికారులకు జనగణన నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2027 జనగణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ దశలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి గృహాల వివరాలు సేకరిస్తారని చెప్పారు. గృహాల పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కుటుంబాల ఆస్తులు వంటి వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. ఈ సమాచారం రెండో దశలో జరిగే జనాభా గణనకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడుతుందని చెప్పారు.మొదటి దశలో ఫీల్డ్ వర్క్‌తో పాటు ప్రజలకు 15 రోజుల పాటు స్వీయ నమోదు అవకాశం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.రెండో దశలో జనాభా గణన నిర్వహించి ప్రతి ఇంటి నుండి ప్రజల వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తారని చెప్పారు.ఇందులో జనాభా గణాంకాలు, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వివరాలు, వలసలు, జననాలు వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారని వివరించారు.ఫీల్డ్ సర్వే పూర్తైన అనంతరం ఐదు రోజులపాటు రివిజన్ రౌండ్ నిర్వహించి నమోదు చేసిన వివరాలను మరోసారి ధృవీకరించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఈ సర్వేను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నందున అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమగ్రంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని తప్పకుండా సర్వే చేసి సమర్థవంతంగా, ఖచ్చితత్వంతో పని చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సీపీఓ జవహర్, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు హోబాలాల్, సరళ తదితరులు పాల్గొన్నారు.