41వ డివిజన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
39,41వ డివిజన్లలో నెలకొన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంసీపీఐ(యు) రంగశాయిపేట ఏరియా కార్యదర్శి గణేపాక ఓదెలు డిమాండ్ చేశారు.సోమవారం కాశికుంట ప్రాంతంలో ఎంసీపీఐ(యు) రంగశాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా సమగ్ర సర్వే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మాలోత్ ప్రత్యూష పాల్గొన్నారు.సర్వే అనంతరం వారు మాట్లాడుతూ 39,41వ డివిజన్లలో అనేక మౌలిక సమస్యలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని తెలిపారు.ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై కాలువల్లో నీరు,చెత్త నిల్వ ఉండటంతో దోమల బెడద పెరిగి ప్రజలు డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.గత రెండు నెలల క్రితం సంభవించిన వరదల కారణంగా ఈ డివిజన్లలోని అనేక ఇళ్లలోకి నీరు చేరి వంట సామాన్లు,గ్యాస్ పొయ్యిలు,బట్టలు,ఫ్రిడ్జ్,బియ్యం తదితర వస్తువులు పూర్తిగా పాడయ్యాయని తెలిపారు.వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని విమర్శించారు.అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.అర్హులైన పేదలందరికీ వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా డివిజన్లలో కోతుల బెడద అధికంగా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని,అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు నరసయ్య,శాఖ కార్యదర్శులు టి.రాజెల్ల,పూలమ్మ,యాకయ్య,కర్ణ,యశోద తదితరులు పాల్గొన్నారు.