
పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల అహ్మదీయ ముస్లిం కమ్యూనిటి అధినేత మిర్జా మస్రూర్ అహ్మద్ సంతాపం
ఈ69న్యూస్ లండన్:-పోప్ ఫ్రాన్సిస్ మృతిపై అహ్మదీయ ముస్లిం సమాజం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.పోప్ మరణవార్త విని ఎంతో బాధపడ్డామని,ఆయన సేవలు యుగయుగాల పాటు ప్రజల జ్ఞాపకాలలో నిలిచిపోతాయని ప్రపంచ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ 5వ అధిపతి ఖలీఫతుల్ మసీహ్ ఖామిస్ మీర్జా మస్రూర్ అహ్మద్ అన్నారు.పోప్ ఫ్రాన్సిస్ తన జీవితాంతం పేదలు,దుర్బలుల కోసం పనిచేశారని,యుద్ధం,హింస,అన్యాయాన్ని ఎదుర్కొంటున్నవారిపై ఆయన చూపిన కరుణ ఉదాత్తమైందని ఖలీఫా పేర్కొన్నారు.ప్రపంచ మతాల మధ్య అవగాహన,శాంతి,మానవతావాదాన్ని విస్తరించేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.పోప్ తన పదవికాలంలో అహ్మదీయ ముస్లిం సమాజ ప్రతినిధులను వాటికన్లో ఆత్మీయంగా స్వాగతించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ,ఆ గౌరవాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని తెలిపారు.కాథలిక్ చర్చి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి అహ్మదీయ ముస్లిం సమాజం తరపున ఆయన హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.