రజాకార్ సినిమాకు ఉత్తమ చారిత్రక వారసత్వ అవార్డు ఇవ్వడం సిగ్గుచేటు
Uncategorizedసిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్
ఆనాటి కాంగ్రెస్ పార్టీ పటేల్ సైన్యాలతో దాడులు చేయించింది
నేటి కాంగ్రెస్ అమరవీరులను అవమానపరుస్తూ అవార్డులు ఇచ్చింది
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను అవమానపరుస్తూ తీసిన రజాకార్ సినిమాకు ఉత్తమ చారిత్రక వారసత్వ సినిమా అవార్డు ఇవ్వడం సిగ్గు చేటైన చర్యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి సీపీఎం జనగామ-హైదరాబాద్ సౌత్ జిల్లాల కార్యకర్తలకు నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్ గా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనుకా రెడ్డి వ్యవహరించగా ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పాల్గొని మాట్లాడుతూ నాడు సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిందని, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, జమీందారులకు, జాగిర్దార్లకు వ్యతిరేకంగా భూమి పంచాలి, వెట్టిచాకిరి నుండి విముక్తి కావాలని నినాదంతో, బాంచన్ కాల్మొక్థ అనే బానిస బతుకులు పోవాలని సాగిన పోరాటాన్ని హిందువులకు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా వక్రీకరిస్తూ తీసిన రజాకార్ సినిమాకి ఉత్తమ చారిత్రక వారసత్వ సినిమా అవార్డు రావడం సిగ్గుచేటు అని అన్నారు. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, 10 లక్షల ఎకరాల భూములను పంచిపెట్టిన చరిత్ర ఎర్రజెండా పార్టీకి దక్కిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పటేల్ సైన్యాలతో గ్రామాలపై పడి ప్రజలపై దాడి చేసి చంపించారని నేడు అదే తీరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ తీసిన సినిమాలకు ఉత్తమ సినిమా అవార్డులు ఇవ్వడం అమరవీరులను అవమానపరచడమే అన్నారు. మూఢనమ్మకాలను అశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందిస్తూ వచ్చిన కల్కి సినిమాకి కూడా ఉత్తమ సినిమా అవార్డు రావడం భారత సమాజాన్ని మూఢ విశ్వాసాలవైపు తీసుకెళ్లడమే అన్నారు. ఆర్ఎస్ఎస్ సినిమాలకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు ఇవ్వడం ఏంటని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికి రైతాంగానికి రైతు భరోసా పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా రైతాంగానికి రుణాలు అందించడంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. వరి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజులగా జరుగుతున్న సిపిఎం నాయకత్వ శిక్షణ తరగతుల్లో స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి కర్తవ్యాలను రూపకల్పన చేసుకున్నారన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు సింగారపు రమేష్ సౌత్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వర్ ఇర్రి అహల్య రాపర్తి సోమయ్య జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి జోగు ప్రకాష్ సుంచు విజేందర్ బెల్లంకొండ వెంకటేష్ పొత్కనూరి ఉపేందర్ భూక్య చందు నాయక్ బోడ నరేందర్ చిట్యాల సోమన్న బిట్ల గణేష్ మండల కార్యదర్శిలు ఇంటి వెంకట్ రెడ్డి,గంగపురం మహేందర్,సారయ్య,సుమ ఉప్పలయ్య,మదార్,సందర్య భవాని,తదితరులు పాల్గొన్నారు.