
గోరింటాకు అనేది మహిళల అలంకారంలో ఒక ముఖ్యమైన భాగం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మునిసిపల్ పరిధిలోని మల్లికార్జున కాలనీ మహిళలు ఆషాఢ మాసం సందర్భంగా అందరూ కలిసి పతంజలి యోగా కేంద్రంలో గోరింటాకు ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం నుండి మహిళలు పిల్లలు ఉత్సాహంగా చేతులకు గోరింటాకు అలంకరణ చేసుకుంటూ రోజంతా గడిపారు. మధ్యాహ్నం వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
గోరింటాకు అనేది మహిళల అలంకారంలో ఒక ముఖ్యమైన భాగం. దీని ఎక్కువగా పెళ్లిళ్లు లేదా పండుగల సందర్భంగా పెట్టుకుంటారు. అతి ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక సంప్రదాయం. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ మాత్రమే కాదు దీని వెనుక అనేక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. సాధారణంగా ఈ సీజన్లో దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. గోరింటాకు పెట్టుకోవడం ఒక అలంకారం మాత్రమే కాదు ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గోరింటాకులో శరీరాని చల్లబరిచే గుణాలు అధికంగా ఉంటాయి. దీని పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. గోరింటాకు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుతుందని చెబుతున్నారు. గోరింటాకులో బోలెడు ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గోరింటాకు పిరీయడ్స్ సమయంలో వచ్చే సమస్యలను, గర్భాశయ దోషాలను తగ్గించడంలో గోరింటాకు సహాయపడుతుందని కొందరు భావిస్తారు. అందుకె ఆషాఢ మాసంలో మహిళలు ఈ సాంప్రదాయాన్ని పాటించడం పరిపాటి.