తెలంగాణ అభివృద్ధి పట్టని బిజెపి •ప్రజాసమస్యలను గాలికి వదిలిన కేంద్ర ప్రభుత్వం-సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు •రేగొండలో ఘనంగా సిపిఐ భూపాలపల్లి జిల్లా మహాసభలు ప్రారంభం
Uncategorized

*ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ*
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో సీపీఐ ఐదవ జిల్లా మహాసభలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా జరిగిన ప్రతినిధుల సభకు కొరిమి సుగుణ, సొత్కు ప్రవీణ్, క్యాతరాజు సతీష్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ జిల్లా నివేదిక ప్రవేశపెట్టారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రేగొండలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సిపిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అరుణ పతాకాన్ని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి అంజలి ఘటించారు. అనంతరం మహాసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపులో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎంపికైన బిజెపి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకురావాలని, తెలంగాణ ప్రాంతానికి రావలసిన ప్రాజెక్టులు, పరిశ్రమలు సాధించాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినా వాటిని నియంత్రించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం,
రూపాయి విలువ పతనంతో
పతనమైన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు. నిత్యావసరాల ధరల పెంపును అరికట్టకుండా బ్లాక్ మార్కెటింగ్ దారులకు వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. హిందువులు, ముస్లింల పేరుతో ప్రజలను విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను, సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని, మాట వినని ప్రతిపక్ష పార్టీ నాయకులపై వాటిని ఉసిగొల్పుతున్నారని అన్నారు. అలాగే బీజేపీ యేతర ప్రభుత్వాలపై గవర్నర్ ల వ్యవస్థతో పెత్తనం చెలాయించాలనే కుట్రను సుప్రీం కోర్టు ఇటీవల తప్పు పట్టిందని అన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.
*ప్రజా సమస్యలను గాలికొదిలి అధికార,విపక్ష నేతల సవాళ్లు హాస్యాస్పదం*
రాష్ట్రంలో ప్రజాసమస్యలను గాలికి వదిలి అధికార, విపక్ష పార్టీల నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలపై వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. నిరంతరం పేదల, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడే కమ్యూనిస్టులుగా తాము ప్రజాసమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు. రానున్న రోజులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలుచేయాలని పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.జిల్లా నాయకులు మామిడాల సమ్మిరెడ్డి,పైళ్ల క్రాంతి కుమార్, పెరుమాండ్ల రాజయ్య, కుడుదల వెంకటేష్,రామ్ చందర్,సుధాకర్ రెడ్డి,గుంటి చంద్రమౌళి,మండల కార్యదర్శి పెంట రవి,నూకల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.