కామ్రేడ్ వి.ఎస్.అచ్యుతానందన్కు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నివాళి
Uncategorized
ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ ఉద్యమాల్లో అనితర సాధ్యమైన నాయకత్వాన్ని అందించిన కురువృద్ధుడు, సిపిఎం వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ వి.ఎస్. అచ్యుతానందన్ (వయసు 101) మరణించడంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్ బ్యూరో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తోంది.
‘విఎస్’ అని మమకారంగా పిలవబడే అచ్యుతానందన్,తన రాజకీయ జీవితమంతా కార్మిక,రైతు,పేద ప్రజల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించారు.ఆయన మొదటి ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు ఆస్పిన్వాల్ కంపెనీలో కోయిర్ కార్మికులను సంఘటితం చేయడంలో ప్రారంభమయ్యాయి.
1940లో కేవలం 17 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఆయన,పున్నప్రా-వయలార్ ఉద్యమంలో భాగంగా తీవ్రమైన పోలీసు హింసను అనుభవించారు.అప్పట్లో వ్యవసాయ కార్మికులపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ముందుండి నడిపారు.
1956లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీలో,1958లో జాతీయ మండలిలో చేరారు.1964లో సిపిఎం ఏర్పాటు సందర్భంగా విడిపోయిన 32 మంది జాతీయ మండలి సభ్యుల్లో చివరివారిగా ఆయనే జీవించి ఉన్నారు.1980 నుండి 1991 వరకూ కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, అనంతరం పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2022లో వయో పరిమితుల నేపథ్యంలో కేంద్ర కమిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానితుడిగా తప్పుకున్నారు.
వి.ఎస్. కేరళ అసెంబ్లీకి ఏడుసార్లు ఎన్నికయ్యారు.ఆయన రెండు సార్లు ప్రతిపక్ష నేతగా,2006-2011 మధ్య ముఖ్యమంత్రిగా సేవలందించారు.ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న సంక్షేమ నిర్ణయాలు కేరళ కార్మిక వర్గానికి ఊరటనిచ్చాయి.
అనేక దశాబ్దాలపాటు పార్టీకి అంకితంగా పని చేసిన ఆయన,కమ్యూనిస్టు ఉద్యమం స్థిరంగా అభివృద్ధి చెందడాన్ని సజీవంగా అనుభవించారు.నిరాడంబర జీవితం, స్పష్టమైన రాజకీయ ధోరణి,ప్రజల పట్ల నిబద్ధత ఆయన ప్రత్యేకత. ఆయన మరణం పార్టీకి, ఉద్యమానికి తీరని లోటు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్ బ్యూరో,కామ్రేడ్ వి.ఎస్. అచ్యుతానందన్కు ఎర్ర జెండా కప్పి ఘన నివాళి అర్పిస్తోంది.ఆయన భార్య, కుమారుడు, కుమార్తెకు తీవ్ర సానుభూతిని తెలియజేస్తోంది.