తెగిన కొత్త కుంట గండిని వెంటనే పూడ్చాలని సిపిఎం డిమాండ్
Galam Telugu E Paper, Nalgondaనల్లగొండ మండలం కాజీరామారం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్త కుంట కట్ట తెగిపోవడంతో రైతుల పొలాలకు ఇసుకమేట చేరి తీవ్ర నష్టం జరిగింది. ఈ గండిని వెంటనే పూడ్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ రోజు సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించగా, గ్రామంలో తెగిన కుంట కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ – “ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి కట్టను పూడ్చాలి. రైతుల పంటలు, భూములు రక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
అలాగే గ్రామ ప్రజలు వెల్లడించిన సమస్యలను ఆయన వివరించారు:
అనేకమంది మహిళలు సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని భర్త చనిపోయినప్పటికీ పెన్షన్లు ఇవ్వడం లేదని వాపోయారని తెలిపారు.
కోతుల బెడద వల్ల ఇళ్లలో వస్తువులు ధ్వంసం అవుతున్నాయి, పంటలు నాశనం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కోతులను పట్టించి అడవుల్లో వదిలివేయాలని డిమాండ్ చేశారు.
రామారo గ్రామందగ్గరగా చెత్త డంపింగ్ యార్డ్ ఉండడం కారణంగా పొగలు, దుర్వాసనలు వ్యాపించి ప్రజలు ఊపిరి పీల్చలేని పరిస్థితి ఏర్పడిందని, అనేకమంది జబ్బులు పాలవుతున్నారని తెలిపారు. ఈగలు, దోమలు, కుక్కల వల్ల ఇబ్బందులు పెరిగాయని, చెత్త డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు నల్లగొండ ఎమ్మెల్యే, రోడ్లు-భవనాల మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు చెత్త డంపింగ్ యార్డ్ తొలగిస్తామని హామీ ఇచ్చినా, నేటికి రెండు సంవత్సరాలు గడిచినా చర్యలు తీసుకోలేదని సిపిఎం నాయకులు తీవ్రంగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, కొండ అనురాధ, మండల కార్యదర్శి నలుపరాజు సైదులు, మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న, బొల్లు రవీందర్, కండె యాదగిరి, గ్రామ నాయకులు కుందారపు సైదులు, కొత్త సైదులు, మేడబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.