
అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వకపోవడం అన్యాయం
గత నాలుగేళ్లుగా అర్హత కలిగిన వారికి పెన్షన్లు ఇవ్వకపోవడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో ధర్వేశిపురం,చర్ల,గౌరారం గ్రామాలలో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ..“ప్రభుత్వం చెప్పేది ఒకటి,చేసేది మరొకటి.ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అమలు పరచకపోవడం ప్రజలతో మోసం చేయడమే”అని విమర్శించారు.భర్తను కోల్పోయిన మహిళలు,ఒంటరి స్త్రీలు,వృద్ధులు నాలుగేళ్లుగా పెన్షన్ రాకపోవడంతో తీవ్ర కష్టాలు పడుతున్నారని తెలిపారు.సర్వేలో ప్రజలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని,బురదమయంగా మారి నడవలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఫిర్యాదు చేశారు.కనీసం పర్మినెంట్ సిసి రోడ్లు వేయాలని వారు కోరారు.ప్రభావతి మాట్లాడుతూ..వచ్చే నెల 1వ తేదీన ఎమ్మార్వో కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ముత్యాలు బ్రహ్మానంద రెడ్డి,బిక్షం,ఎస్.కే.సుల్తానా,బోగారి బిక్షం తదితరులు పాల్గొన్నారు.