విద్యతోపాటు, కళా రంగాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులలో చదువు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని రాష్ట్రపతి నిలయం హైదరాబాద్ విజిటర్స్ ఫెలిసిటేషన్ సెంటర్ ఇన్చార్జి సందీప్ కుమార్ అన్నాడు. హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ కళాబంధు డాక్టర్ పి అనూహ్య రెడ్డి ఆధ్వర్యంలో చిన జీయర్ స్వామి ఆస్థాన నాట్య విద్వాంసులు ఘంటసాల పవన్ కుమార్ కొరియో గ్రఫీతో అష్టలక్ష్మి బ్యాలెను, శ్రీలక్ష్మి కూచిపూడి డాన్స్ అకాడమీ గురువు అనుదీప్తి శిష్య బృందం ద్వారా నవదుర్గ బ్యాలెను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని అకాడమీ చీఫ్ అడ్వైసర్ చినుకు పిఎన్ మూర్తి పర్యవేక్షించారు.నాట్య గురువులు అనుదీప్తి, నిహారిక నృత్యకారులను అభినందించి సందీప్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం కనులవిందుగా అద్భుతంగా ప్రదర్శించబడిందన్నారు. భవిష్యత్తులో కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ చేయబోతున్న కార్యక్రమాలకు తగిన అవకాశాలు కల్పిస్తామని, ఢిల్లీ రాష్ట్రపతి భవనంలో కూడా ఇటువంటి ప్రదర్శనలకు అవకాశం కల్పించేలా కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం కళాబంధు డాక్టర్ పి అనూహ్య రెడ్డి సందీప్ కుమార్ ను ఆత్మీయంగా సత్కరించారు.