అంబులెన్స్ రాక ఆలస్యం-ఆటోలోనే గర్భిణీకి ప్రసవం
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో ఒక గర్భిణీ మహిళ ఆటోలోనే ప్రసవించింది.తల్లి,బిడ్డ క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.గ్రామానికి చెందిన కనకలక్ష్మి అనే మహిళకు ఆదివారం తెల్లవారుజామున పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.అయితే,అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడంతో,ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రికి తరలించేందుకు ఆటోలో బయలుదేరారు.నెల్లుట్ల గ్రామం సమీపంలోకి రాగానే కనకలక్ష్మికి నొప్పులు తీవ్రమయ్యాయి.దీంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్,వెంటనే గ్రామంలోని ఆశా వర్కర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.ఆటోను అక్కడే ఆపేశారు.సమాచారం అందుకున్న ఆశా వర్కర్లు అరుణ,పుష్ప,ఉమ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.వారి చాకచక్యం,ధైర్యంతో ఆటోలోనే కనకలక్ష్మికి పురుడు పోశారు.ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.ప్రసవం అనంతరం,తల్లి,నవజాత శిశువును ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి,సురక్షితంగా ప్రసవం చేయించిన ఆశా వర్కర్ల కృషిని స్థానికులు అభినందించారు.