
సీసీ రోడ్లు,డ్రెయిన్లు వెంటనే నిర్మించాలి
జనగామ పట్టణంలోని మూడో వార్డులోని బాలాజీ నగర్,జ్యోతి నగర్,ఎల్లమ్మగుడి ఏరియా,కోటిరత్న ఆస్పత్రి వెనుక భాగం,ఏకశిలా డిగ్రీ కాలేజ్, జిఎంఆర్ కాలనీ,సెయింట్ మేరీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెంటనే సీసీ రోడ్లు,సీసీ సైడ్ డ్రెయిన్లు నిర్మించి మురుగు, వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యుడు బూడిదీ గోపి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనగామ పట్టణంలోని ప్రధాన రహదారులకు అతి సమీపంలో ఉన్న మూడో వార్డు బయటికి అభివృద్ధి చెందినట్లు కనిపించినప్పటికీ,లోపల తీవ్రమైన మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి.20–25 సంవత్సరాలుగా ప్రజలు నివసిస్తున్నా సీసీ రోడ్లు,మురుగు కాలువలు లేకపోవడం దారుణం.ఇలాంటి పరిస్థితి మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా లేదు అని తెలిపారు.మున్సిపాలిటీ అధికారులు,పాలకులు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు.మూడో వార్డు నుంచి మున్సిపాలిటీకి అత్యధిక పన్ను ఆదాయం వస్తుంది. పన్నులు వసూలు చేసుకోవడంలో శ్రద్ధ చూపుతున్న అధికారులు ప్రజల సౌకర్యాలపై మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు,అని బూడిదీ గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా సందర్శించి రోడ్లు,డ్రెయిన్లు,వీధి లైట్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో స్థానిక ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ధర్నా అనంతరం సిపిఎం నాయకులు కమిషనర్ మహేశ్వర్ రెడ్డికు మెమోరాండం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్,బాలాజీ నగర్ వాసులు బింగి మధు,శ్రీనివాస రెడ్డి,భైరగోని శ్రీనివాస్,మాడూరి బాలయ్య,బస్వా రమ్య,శెంకరి,మాధవి,చిట్టీపోలు శ్రీనివాస్,సునీల్ తదితరులు పాల్గొన్నారు.