పొలంలో విద్యుత్ తీగలు తగిలి లేబర్ మృతి
హనుమకొండ జిల్లాలోని వంగ పహాడ్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.పెరడు కోసం పొలం యజమాని ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి రాజు అనే లేబర్ (కూలీ)మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే,వంగ పహాడ్ గ్రామానికి చెందిన రాజు పొలంలో పనులు చేస్తుండగా,అక్కడ ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు ప్రమాదవశాత్తు తగిలాయి.దీంతో విద్యుత్ షాక్‌కు గురై రాజు అక్కడికక్కడే మరణించాడు.ఈ దుర్ఘటనతో ఆగ్రహించిన మృతుని బంధువులు,తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పొలం యజమాని ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.పొలం యజమాని నిర్లక్ష్యం వల్లే రాజు మరణించాడని,తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నిరసన వ్యక్తం చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.