తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాలలో ఎమ్మెల్యే కడియం పర్యటన
ధర్మసాగర్ మండలం దేవనూర్ గ్రామంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాన్నీ స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి పరిశీలించారు . ధర్మసాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో తమ పంటలు మునిగిపోయాయని ఆవేదన చెందిన రైతులు పురుగులమందు త్రాగడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి రైతులు మోరె మహేందర్, చిట్టి రవి, నార్లగిరి సమ్మయ్య, కొమురయ్యలను అడ్డుకొని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వరద ముంపుకు గురైన పంటలను కడియం శ్రీహరి పరిశీలించారు. నష్టపోయిన రైతులను కలిసి మాట్లాడారు. కడియం వెంట అధికారులు రావడంతో రైతులు అధికారులను నిలదీశారు. అర్ధరాత్రి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎలా ఎత్తారని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. నష్టపోయిన తమ పంటల పూర్తి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యుద్ధ ప్రాతిపదికగా రహదారి నిర్మించాలి…
ఇటీవల వర్షాలకు కొట్టుక పోయిన దేవునూరు,ధర్మసాగర్ ప్రధాన రహదారిని, ఇజిఎస్ నుండి 5 లక్షలు, ఆర్ అండ్ బి నుండి 5 లక్షలతో 15 రోజులలో యుద్ధ ప్రాతిపదికగా నిర్మించాలని, త్వరలో రాకపోకలను పునరుద్ధరించాలని అదేశించారు… తెగిపోయిన రహదారితో దేవునూరు గ్రామం నుండి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. .. కడియం వెంట స్థానిక తహశీల్దార్ సదానందం, ఎంపిడిఓ అనిల్ కుమార్, పంచాయతీ రాజ్ ఏఈ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారు.