జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
తెలుగు గళం హన్మకొండ/ ధర్మసాగర్ న్యూస్
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హన్మకొండ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పంటలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం ధర్మసాగర్ మండలంలోని దేవునూరు, ముప్పారం గ్రామాలను సందర్శించారు. వర్షాల వల్ల నష్టపోయిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారులు కలెక్టర్ కు వరద తాకిడికి పశు సంపదకు జరిగిన నష్టం మరియు దాదాపు 450 క్వింటల్ల వరి ధాన్యం కొట్టుకుపోయిందని వివరాలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రైతు వారీగా పంటల నష్టం వివరాలను సర్వే నంబర్లతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు యాప్‌లో వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉందని, అందుకోసం పంటల వివరాలు త్వరగా సిద్ధం చేయాలని సూచించారు.దెబ్బతిన్న రోడ్లను కూడా కలెక్టర్ పరిశీలించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మాట్లాడారు. రోడ్ల మరమ్మతు పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ధర్మసాగర్ దేవునూరు ప్రధాన రహదారి, అంతర్గత రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పరిశీలనలో గుర్తించారు.అదేవిధంగా ధర్మసాగర్ రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.ఈ పరిశీలన కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారామ్, డిఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ మంగీలాల్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, ఏవో రాజేష్,ముప్పారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.