ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా
ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిన విషయంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో డిసెంబర్ 10లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది వడ్ల శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ జీవో చట్టవిరుద్ధమని, సర్వీసు నియమాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సూరేపల్లి నంద ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. సంబంధిత జీవో జారీకి ఉన్న న్యాయపరమైన ఆధారాలు, కేంద్ర సేవా నియమాలు పాటించారో లేదో వివరించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు దృష్ట్యా రాష్ట్ర ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ప్రమోషన్ వ్యవహారాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వ వివరణపై ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది.