విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతకు గుర్తింపు
63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ ఉత్తమ సేవలు అందించిన హోంగార్డ్స్‌ను సత్కరించింది. ఈ కార్యక్రమంలో రేగొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డ్ కుమార్ తన విధుల్లో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావానికి గుర్తింపుగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.
హోంగార్డ్ కుమార్ రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్టు ప్రాసెస్ డ్యూటీ లో పనిచేస్తున్నారు. నేరస్తులకు నోటీసుల జారీ, కోర్టుకు సంబంధించిన పత్రాల పంపిణీ, హాజరుల నిర్వహణలో ఆయన చూపిన సమయపాలన, బాధ్యతాయుత వైఖరి, చురుకుదనం పోలీసు వర్గాల దృష్టిని ఆకర్షించింది. తన పని పట్ల చూపిన అంకితభావంతో పలు సందర్భాల్లో క్లిష్టమైన కోర్టు ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించడంలో కుమార్ పాత్ర ప్రత్యేకమైందని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు.
హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, “పోలీసింగ్ వ్యవస్థలో హోంగార్డ్స్ పాత్ర చాలా కీలకం. కేసుల విచారణ, నిఘా, కోర్టు ప్రాసెస్ వంటి ప్రతీ పనిలో వారు చూపే క్రమశిక్షణ, అంకితభావం పోలీస్ శాఖను బలోపేతం చేస్తుంది. తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించే కుమార్ లాంటి సిబ్బంది వల్లే పోలీసులు ప్రజలకు మరింత సమర్థంగా సేవలందించగలుగుతున్నారు” అని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, హోంగార్డు ఆర్‌ఐ పూర్ణ, వెల్ఫేర్ ఆర్‌ఐ కాసిరం నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రశంసాపత్రం అందుకున్న కుమార్‌ను గణపురం సీఐ కరుణాకర్ రావు, రేగొండ ఎస్సైలు రాజేష్,సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి,తోటి హోంగార్డ్స్ శ్రీశైలం, శ్రీను తదితరులు అభినందించారు. స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామస్థులు కూడా కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా పోలీసుల ఉత్సాహంతో నిర్వహించగా, సత్కారం పొందిన కుమార్ ఈ గౌరవాన్ని తనపై ఉంచిన నమ్మకానికి ప్రతీకగా భావిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో కూడా అదే విధంగా క్రమశిక్షణతో సేవలందిస్తానని ఆయన పేర్కొన్నారు.