మండలాల్లో ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య పర్యటన
ఎన్నికల వ్యయ నియంత్రణలో భాగంగా ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య , ఎక్స్‌పెండిచర్ నోడల్ ఆఫీసర్ ఏ.వీ. రెడ్డి ఆదివారం దుమ్ముగూడెం మరియు చర్ల మండలాల్లో పర్యటనలు నిర్వహించారు.
ముందుగా అధికారులు దుమ్ముగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయాన్ని సందర్శించి, పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, ఎన్నికల వ్యయ నమోదు రిజిస్టర్లు, షాడో రిజిస్టర్, రసీదులు మరియు లావాదేవీల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. వ్యయ పరిమితుల అమలు, పత్రాల నిర్వహణలో ఖచ్చితత్వం, మరియు పారదర్శక విధానాలపై సంబంధిత సిబ్బందికి సూచనలు అందజేశారు.
తరువాత అధికారులు చర్ల మండలంలో కూడా వ్యయ రికార్డులను పరిశీలించి, అనంతరం పోటీ చేస్తున్న అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థులు ఎన్నికల వ్యయ నియమావళిని కచ్చితంగా పాటించాలని, ప్రతి ఖర్చు లావాదేవీని తగిన ఆధారాలతో నమోదు చేయాలని, సమయానుసారంగా రిపోర్టులు సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అత్యంత ముఖ్యమని, ఏవైనా లోపాలు ఉన్న పక్షంలో తక్షణమే సరిదిద్దాలని అధికారులు తెలిపారు.
ఈ పర్యటనలో ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ టీములు, MPDO సిబ్బంది మరియు సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు.