రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి-ఎమ్మెల్యే గండ్ర
సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి కాలరీస్ సంస్థ వెన్నెముకలాగా నిలుస్తోందని,బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్రంతో పాటు దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సింగరేణి కాలరీస్ సంస్థ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యేకు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.అనంతరం జీఎం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సింగరేణి జీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు.తదనంతరం జెండావిష్కరణ చేసి, వేదికపై కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సింగరేణి సంస్థ కీలక స్థంభంగా నిలుస్తోందని తెలిపారు. కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు లభించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.సింగరేణి సంస్థ ఆధునికీకరణ, సాంకేతిక అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా సింగరేణి మరింత ప్రగతి సాధించేలా కార్మికులు,అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.సింగరేణి సంస్థకు సుస్థిర భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని, సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని కోరారు.ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి.