దేశంలోని సామాజిక అసమానతలకు మూలం మనుస్మృతే
మనువాదం ఆశాస్త్రీయం-రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశానికి ప్రమాదకరం
కెవిపిఎస్,సామాజిక ప్రజాసంఘాల నేతలు
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారతదేశంలో సామాజిక అసమానతలు,కుల వివక్షలను సృష్టించిన గ్రంథం మనుధర్మశాస్త్రమేనని,అది పూర్తిగా ఆశాస్త్రీయమైనదని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తీవ్రంగా విమర్శించారు.1927 డిసెంబర్ 25న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో వేలాది దళిత-బహుజనులతో కలిసి మనుధర్మశాస్త్రాన్ని దగ్ధం చేసిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని,గురువారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్)ఆధ్వర్యంలో మనుధర్మశాస్త్ర ప్రతులను దగ్ధం చేశారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యావంతుల వేదిక,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం,ప్రగతిశీల యువజన సంఘం,మాల మహానాడు తదితర సామాజిక ప్రజాసంఘాలు మద్దతు పలికాయి.
“మనుస్మృతే అన్ని వివక్షలకు మూలం”
ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ..వేల సంవత్సరాలుగా ప్రజల మధ్య సామాజిక అంతరాలు సృష్టించిన అసంబద్ధమైన,అనాగరిక ఆలోచనలకు మూలం మనుస్మృతేనని అన్నారు.మెజార్టీ ప్రజలకు సహజంగా లభించాల్సిన భూమి,విద్య,ఆభరణాలు,ఆయుధాలు,అధికారాలను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించేందుకు కర్మ సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకొని బ్రాహ్మణీయ మనువాద శక్తులు ఈ దేశంలో అమలు చేస్తున్నాయని విమర్శించారు.మనుస్మృతి భావాలను తుదముట్టించకపోతే దేశంలో అసమానతలు,వివక్షలు,దోపిడీ వంశపారంపర్యంగా కొనసాగి,కొందరు కోటీశ్వరులుగా,కోట్లాది మంది బిక్కచులుగా మిగిలే ప్రమాదం ఉందన్నారు.రూపాలు మారినా సారం మారలేదని,బ్రాహ్మణాధిపత్యాన్ని కాపాడటానికి,దోపిడీ వ్యవస్థను రక్షించడానికే మనువాదం పుట్టిందని స్పష్టం చేశారు.బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశానికి ప్రమాదం
తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ..1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం మనువాద మూలాలపై గట్టి దాడి చేసిందన్నారు.రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యం,సామాజిక న్యాయం అమలులోకి వచ్చి కొన్ని వర్గాలకు హక్కులు లభించాయని చెప్పారు.ఈ మేరకు వచ్చిన స్వల్ప వెసులుబాటును కూడా అగ్రకుల సంపన్న వర్గాలు,వారి రాజకీయ ప్రతినిధులైన బీజేపీ-ఆర్ఎస్ఎస్ భరించలేకపోతున్నాయని ఆరోపించారు.“మనకెందుకు అంబేద్కర్ రాజ్యాంగం-మనుధర్మమే కావాలి”అని బీజేపీ నాయకుడు అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ,ఇవన్నీ తిరిగి మనుధర్మాన్ని ప్రతిష్ఠించాలనే ప్రయత్నాలేనన్నారు.గోల్వాల్కర్ నుంచి మోహన్ భాగవత్ వరకు,శ్యామప్రసాద్ ముఖర్జీ నుంచి నేటి మోదీ వరకు ‘మనధర్మం’ పేరిట మనుధర్మాన్నే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.మనువాదాన్ని పాతరేయాలి
తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం (టిపివైఎస్) జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం మాట్లాడుతూ,రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చట్టం ముందు అందరూ సమానులనే భావన ఏర్పడిందన్నారు.అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనపరిచి,తిరిగి మధ్యయుగాల నాటి మనుస్మృతిని అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.దీని వల్ల మత వైషమ్యాలు,కుల ఘర్షణలు పెరిగి,సమాజం మరింత విచ్ఛిన్నమవుతుందన్నారు.దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని,బహుజన ప్రజలంతా అప్రమత్తంగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్,మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గోలి సైదులు,గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న,మాలల ఐక్యవేదిక జిల్లా నాయకుడు అద్దంకి రవీందర్,మాల మహానాడు జాతీయ కార్యదర్శి తెలగమల యాదగిరి,కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదే నరసింహ,సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఔట రవీందర్,డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు.