యూరియా బుకింగ్ యాప్ వినియోగంలో జిల్లా రైతులు ముందంజ
అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్
యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులకు సులభంగా,పారదర్శకంగా,అవసరానికి అనుగుణంగా యూరియా పంపిణీ జరుగుతుందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ అన్నారు.శనివారం ఆయన జిల్లా వ్యవసాయ అధికారి అంబిక సోనితో పాటు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జనగాం,లింగాలఘణపూర్ మండలాల్లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను సందర్శించారు.యూరియా బుకింగ్ యాప్ ద్వారా జరుగుతున్న యూరియా విక్రయ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని ఎరువుల విక్రయ కేంద్రాల్లో యూరియా సంచులు తగినంతగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.డీలర్లకు సూచనలు జారీ చేస్తూ,యాప్ ద్వారా బుకింగ్ ఐడీతో రైతు వచ్చిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా యూరియా విక్రయాన్ని తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.బుకింగ్ ఉన్నప్పటికీ విక్రయంలో ఆలస్యం చేయడం లేదా పెండింగ్‌లో ఉంచకూడదని హెచ్చరించారు.అలాగే రైతులు తాము సాగు చేస్తున్న పంటకు,పంట దశను బట్టి అవసరమైన సమయంలోనే యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.ఈ విషయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ అధికారులు,వ్యవసాయ విస్తరణ అధికారులు,ఎరువుల డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో యూరియా కొరత లేదని,అవసరానికి అనుగుణంగా సరిపడిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.రైతులందరూ యూరియా కొనుగోలుకు తప్పనిసరిగా యూరియా బుకింగ్ యాప్‌ను వినియోగించాలని సూచించారు.డిజిటల్ సాంకేతికత ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని అన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలులో ఉన్న ఈ యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని ఏ అధికారిక ఎరువుల విక్రయ కేంద్రం నుండైనా సులభంగా యూరియాను బుక్ చేసుకునే సౌకర్యం కలిగిందన్నారు.పంట దశను బట్టి అవసరమైన సమయంలో మాత్రమే యూరియాను బుక్ చేసుకోవాలని,మొత్తం సీజన్ అవసరాన్ని ఒకేసారి బుక్ చేసుకోవడానికి తొందరపడవద్దని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే,జనగాం జిల్లా రాష్ట్రంలోనే యూరియా బుకింగ్ యాప్ వినియోగంలో ముందంజలో ఉందని తెలిపారు.కేవలం ఐదు రోజుల వ్యవధిలో (డిసెంబర్ 22 నుంచి 26,2025 వరకు) జిల్లాలో మొత్తం 50,377 యూరియా సంచులు యాప్ ద్వారా బుక్ చేయబడటం రైతుల విశ్వాసాన్ని,యాప్ విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందన్నారు.
“యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులకు కలిగే ముఖ్య ప్రయోజనాలు”
పీపిబి నంబర్,పంట వివరాలతో సులభమైన బుకింగ్
అందుబాటులో ఉన్న యూరియా కోటా స్పష్టంగా కనిపించడం
సమీపంలోని అధికారిక విక్రయ కేంద్రం ఎంపిక అవకాశం
ఎరువుల దుకాణాల వద్ద రద్దీ తగ్గింపు
అక్రమాలు,ద్వంద్వ విక్రయాలకు అడ్డుకట్ట
రైతుల సమయం,ఖర్చు ఆదా