గిరిజన ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
సావిత్రిబాయి పూలే ఆదర్శంగా నిలవాలి
ప్రధానోపాధ్యాయులు బి.సురేందర్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.సురేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన అతి సామాన్య పేద కుటుంబంలో జన్మించిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న వివక్షతను తొలగించేందుకు భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో విద్యను ఆయుధంగా చేసుకొని పోరాడిన గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి అని పేర్కొన్నారు.స్త్రీలకు విద్య లేకపోతే సమాజ అభివృద్ధి సాధ్యం కాదని 195 సంవత్సరాల క్రితమే గ్రహించి,ఆ లక్ష్య సాధన కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు.అగ్రకులంలో పుట్టిన ఆడపిల్లకైనా,అణగారిన వర్గాల్లో పుట్టిన పేద బిడ్డకైనా ఒకే విద్య అందాలనే లక్ష్యంతో ఆమె పోరాడారని అన్నారు.ఆడపిల్లలను ఇంటి నాలుగు గోడల మధ్య నుంచి బయటకు తీసుకువచ్చి,ప్రపంచానికి వారి శక్తి,జ్ఞానం పరిచయం చేసిన గొప్ప మహిళా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మహిళలు చదువుకొని అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తుండటానికి ప్రధాన కారణం ఆమె చేపట్టిన విద్యా ఉద్యమమేనని తెలిపారు.అదే నేటి సమానత్వ సమాజానికి పునాదిగా నిలిచిందన్నారు.సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని,ముఖ్యంగా యువత విద్యను ఆయుధంగా చేసుకొని సమాజ పురోగతికి కృషి చేయాలని ఆయన కోరారు. సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని పాఠశాలలో చదువుతున్న బాలికలు ఉన్నత స్థాయికి చేరి,అనేకమంది అణగారిన విద్యార్థినీలకు ప్రేరణగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ పార్వతీబాయి,దశరథ్,వాసు,పద్మ,శ్రీమతి,మల్లు,వీరన్న,సుజాత,కల్పనా,సునీత,అనిత,ఏఎన్‌ఎం స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.