సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా-గ్రామ సర్పంచ్
హన్మకొండ జిల్లా వనమాల కనపర్తి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ రిపిక ఎల్లస్వామీ అన్నారు.స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సహకారంతో ప్రభుత్వ నిధులు సమకూర్చుకొని గ్రామ అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడతామని ఆమె స్పష్టం చేశారు.గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు.ముఖ్యంగా గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం,డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం,స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను నిరంతరంగా అందించడం,ప్రతి వీధిలో వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని అన్నారు.పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాన్ని పరిశుభ్రమైన,ఆరోగ్యకరమైన వాతావరణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.విద్య,ఆరోగ్య రంగాల అభివృద్ధి తన పాలనలో ప్రధాన అజెండాగా ఉంటుందని రిపిక ఎల్లస్వామీ పేర్కొన్నారు.గ్రామంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల,విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.అవసరమైన చోట ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.మహిళా సాధికారత దిశగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తామని,మహిళలకు ఉపాధి కల్పించే శిక్షణా కార్యక్రమాలు,రుణ సౌకర్యాల ద్వారా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు.అలాగే గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు,ఉపాధి పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పారదర్శకంగా అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.ప్రజలతో నిరంతరం సంబంధం ఉంచుతూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించే విధంగా పాలన సాగిస్తామని తెలిపారు.గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ,ప్రతి ఒక్కరి సహకారం,సూచనలతో వనమాల కనపర్తిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని రిపిక ఎల్లస్వామీ అన్నారు.