చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి
ఆధునిక సామాజిక సంఘ సంస్కర్త భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే ఫాతిమాషేక్ ల జయంతి క వారోత్సవాల సభ మొదటి రోజును రాష్ట్ర అధ్యక్షులు నంది విజయలక్ష్మి అధ్యక్షతన కర్నూలు జిల్లా సి క్యాంపు సెంటర్ నందు గల డ్రైవర్స్ అసోసియేషన్ హాలు నందు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, డాక్టర్ కంచర్ల హరిప్రసాద్, నక్కలమిట్ట శ్రీనివాసులు , శేషఫణి, మోజస్, క్రాంతికుమార్, శేఖర్ నాయుడు, అన్వర్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆమె స్ఫూర్తిని స్మరించుకుని ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆధునిక ఇంగ్లీషు విద్యను అందుకున్న తొలి మహిళా ఉపాధ్యాయురాలు స్ర్తీ విద్య కొరకు పాటుబడిన మహనీయురాలు మరియు తొలి మహిళా సంఘ సంస్కర్త మాత్రమే కాదు తొలి ఆధునిక కవయిత్రి కూడా అని 1854లో ఆమె కావ్య పూలే అను కవితా సంపుటి రచించారని ఆమె తెలిపారు. జ్యోతిరావు పూలే ఇంట ప్రారంభమైన నిశ్శబ్ద విప్లవం సావిత్రిబాయిపూలే అని ఆమె అన్నారు. అంతేకాక సావిత్రిబాయి పూలే బహుజన బాలికల విద్యకు ఎంత పాటుపడిందో అంతగాను స్త్రీల సమస్యలపై పని చేసిందని ఆమె అన్నారు. సర్వ మానవ హక్కులు అనుభవిస్తూ స్త్రీల ఆత్మ గౌరవంతో జీవించడానికి 1852 లో మహిళా సేవ మండలి అను మహిళా సంఘాన్ని సావిత్రిబాయి పూలే స్థాపించారని ఆమె తెలిపారు. ఆనాడు సమాజంలో ఉన్న అతి తీవ్ర సమస్య వితంతు స్త్రీల దుర్భర జీవితమని ఇది బ్రాహ్మణులలోనే ఎక్కువగా ఉండేదని వారు అన్నారు. నేటి తరం స్త్రీలు అన్ని రంగాల్లో అన్ని హక్కులతో జీవిస్తున్నారు అంటే అది సావిత్రిబాయి పూలే త్యాగ ఫలితమే అని వారు అన్నారు.అటువంటి మహనీయుల జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి ప్రతి పాఠశాల లోనూ జయంతి కార్యక్రమాలను జరపాలని, నేటితరం విద్యార్థులు,మహిళలు సావిత్రిబాయి పూలే ఆదర్శాల తో ముందుకు నడవాలని వారు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం మహిళా ఐక్య వేదిక క్యాలెండర్ ని ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్యవేదిక కర్నూలు జిల్లా అధ్యక్షురాలు వగ్గ ఈరమ్మ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు కటికే భాను ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు కార్యదర్శులు మహిళా ఐక్య వేదిక సభ్యులు పాల్గొనడం జరిగింది.