ఓటర్ జాబితాలో భారీ అక్రమాలు
సవరణ పూర్తయ్యే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలి–తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ జాబితా పూర్తిగా తప్పులతడకగా తయారైందని,వెంటనే సవరించకపోతే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం భూపాలపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో ఓటర్ జాబితాలో విస్తృత స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.కొన్ని వార్డులలో ఒకే ఇంటి నెంబర్‌పై 70 నుంచి 80 వరకు ఓట్లు నమోదు చేయడం,బై నంబర్లతో నకిలీ ఓట్లను చేర్చడం ద్వారా అధికారులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును రాజకీయ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితాను పూర్తిగా పునఃపరిశీలించి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ తీసుకొని తప్పులున్న ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.ఆయా వార్డులలో వాస్తవంగా నివసిస్తున్న వ్యక్తులకు మాత్రమే ఓటు హక్కు ఉండేలా నూతనంగా సవరించిన ఓటర్ జాబితా రూపొందించాలని కోరారు.అలాగే, వేరే గ్రామాలకు చెందిన వారికి అక్రమంగా ఓట్లు నమోదు కావడం, రామప్ప కోటర్స్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన సుమారు వెయ్యి మంది ఓటర్ల పేర్లు ఇంకా జాబితాలో కొనసాగడం తీవ్ర అన్యాయమని తెలిపారు. ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే ఓటు హక్కు కల్పించి, మిగిలిన అక్రమ ఓట్లను తప్పనిసరిగా తొలగించాలని డిమాండ్ చేశారు.ఓటర్ జాబితా సవరణ పూర్తయ్యే వరకు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన రవి పటేల్ గారు స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, అనంతుల సంపత్ (బొట్టు), కౌటం సురేందర్, రొడ్డ శ్రీనివాస్, తరంగుల నికీష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.