పామునూరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
కారు-ఆటో ఢీ-ఆటో డ్రైవర్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలు
మద్యం మత్తు,అతివేగం,రాంగ్ రూట్ కారణంగా ప్రమాదం
జనగామ జిల్లా,స్టేషన్ ఘనపూర్ మండలం పామునూరు గ్రామ శివారులో కారు-ఆటో ఢీకొన్న ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల వివరాల ప్రకారం,ఆటో డ్రైవర్ వడ్లకొండ మధూకర్ తన సాధారణ సర్వీస్ ప్రకారం పలువురు ప్రయాణికులతో ఆటోలో ఘనపూర్ వైపు వెళ్తుండగా,ఘనపూర్ నుండి వచ్చిన ఓ కారు డ్రైవర్ అతివేగంగా రాంగ్ రూట్లో కారు నడుపుకుంటూ వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ వడ్లకొండ మధూకర్ కు తీవ్ర గాయాలు కాగా,అతడి రెండు కాళ్లు విరిగిపోయినట్లు తెలిపారు.అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు ఫ్రాక్చర్లతో పాటు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు వెల్లడించారు.ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా,అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు అప్పగించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.