గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నేరం
చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం మినీ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 అమలుపై జిల్లా స్థాయి సముచిత అధికారి సమావేశం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో చట్ట అమలుపై సమీక్ష నిర్వహించారు.లింగ ఆధారిత గర్భస్థ శిశు లింగ నిర్ధారణను పూర్తిగా అరికట్టేందుకు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.బాలికల రక్షణకు ఈ చట్టం అత్యంత కీలకమని పేర్కొన్నారు.జిల్లాలోని గర్భ నిర్ధారణ కేంద్రాల పనితీరు,నమోదు స్థితి,నిర్వహిస్తున్న తనిఖీలు,రికార్డుల నిర్వహణ,చట్ట ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.నిబంధనలను కచ్చితంగా పాటించేలా నిరంతర తనిఖీలు నిర్వహించాలని,చట్టాన్ని ఉల్లంఘించిన నిర్ధారణ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.అలాగే బాలికల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని,గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారి రాజ మహేంద్ర నాయక్,జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా.కె.మల్లికార్జున్ రావు,ఆరోగ్య శాఖ అధికారులు,ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.