పాట కైగట్టే..వడుపు తెలిసినోడు....గూడ అంజయ్య
ఒక ఆలోచన, వాక్యంగా పాటగా ,మారాలంటే… అది కేవలం విశ్వాసాల్ని తన సిద్ధాంతాన్ని ప్రకటిస్తేనే చాలదు
ఆ పాట ప్రజలలో ప్రాణంతో కొట్టుకోవాలి, ఆ కదలిక ఎలా ఉండాలి అంటే? ఒక చేప నీళ్లల్లో ఉన్నప్పుడు హుషారుగా ఈదినట్లుగా… ఆ చేప ఒడ్డున పడ్డప్పుడు గిలగిల కొట్టుకున్నట్లుగా ఉండాలి అంటారు గూడ అంజయ్య అందుకే ఆయన పాటల్లో సజీవ లక్షణం,చలనశీలనంగా ఉన్నాయి
ఎంత జటిల, కఠిన సమస్యనైనా పాటగా మార్చడంలో నేర్పరి అంజన్న తన చుట్టూ ఉన్న జీవితం పట్ల ముందు మనిషిగా స్పందిస్తాడు నీటికి చలనం ఉన్నట్లే పాటకు జీవం ఉండాలి అనేవాడు పాటను కైగట్టే వడుపు తెలిసినోడు
గూడ అంజయ్య
వారి పాటలను పరిశీలిస్తే జీవితం నుంచీ విడదీసి చూడలేరు . తాను అనుకున్నది అనుభవించినది రాయలనుకుంటేనే రాస్తాడు.
కాసులకు, పవర్ రాజకీయులకు మరేవరికి తల వంచలేదు. స్వీయ ప్రయోజనాలకోసం పాకులాడలేదు. అధికారానికి దాసోహం అనకుండా ప్రజల పక్షం వహించాడు. ప్రజలనుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రజలకే అంకితం చేశాడు. పెయి మీద అంగీ కాళ్ళకి చెప్పులు లేని బడుగు జీవుల అనుభవాలు గుండె గోస బాస యాస కష్టాలూ కన్నీళ్ళే తన పాటకి ప్రాణం పోశాయని అనేవారు
ప్రజలే తనకు గురువులై పాటని మహాకావ్యంగా శిఖరంపై నిలిపారని అంజన్న చెప్పుకోనేవాడు. ప్రజల పట్ల వారి సంస్కృతి పట్ల భాష పట్ల రాజకీయాల పట్ల అతనికున్న ఆ వినమ్రత కారణంగానే అతను ‘పాట కవుల వేదిక’ అయ్యాడు. మలి దశ తెలంగాణా వుద్యమంలో తొలిపొద్దయ్యాడు అయ్యాడు.
అంజన్న పాట తెలంగాణా రాష్ట్ర సాధన లో ధూం ధాం లలో అంజన్న పాట పోరు హోరయ్యింది. ‘నా తెలంగాణ – నిలువెల్ల గాయాల వీణ , నను గన్న నా తల్లి – నా తెలంగాణ’ పాట తెలంగాణా ప్రజల దు:ఖాన్ని ఆర్తినీ ఆవిష్కరిస్తే , ‘పుడితొక్కటి – సత్తె రెండు రాజిగ ఒరె రాజిగ , ఎత్తూర తెలంగాణ జెండ రాజిగ ఒరె రాజిగ’ పాట ఉద్యమ చైతన్యాన్ని నింపింది. ‘అయ్యోనివా – అమ్మోనివా’ అనే పాట అశాస్త్రీయతనీ తాత్త్విక గందరగోళాన్నీ బోలుతనాన్నీ యెండగట్టింది. తెలంగాణా రాష్ట్ర సాధనలో తన పాటని ఆయుధంగా అందించిన అంజన్నయాభై యేళ్ళ తెలంగాణా కల సాకారం కావడడం కళ్ళారా చూసుకోగలిగాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం అతనిది.
తెలంగాణా లో గడిలను కేవలం ఒక పాట గడ గడ లాడించింది , ఉరికించింది అంజన్న పాటలు కోస్తాంధ్ర లో కూడా విస్తృతప్రచారం పొందాయి.
ఒక సారి కాకినాడ లో జోరువానని సైతం లెక్కజేయక ప్రజలు దొర ఏందిరో వాని దోపిడేందిరో అని అంజన్నతో గొంతు కలిపారు. కాకినాడ నుంచి తిరుగు ప్రయాణంలోనే ఆ పాటగాళ్ళందరిని పోలీసులు వేటాడి అరెస్టు చేశారు అందులో అంజన్న ఉన్నాడు. వారందరినీ జైల్లో పెట్టారు జైలులో అనేక పాటలు రాశారు శ్రీపాద శ్రీహరి మీద చుక్కలాంటి చుక్కల్లో..లక్షలాది చుక్కల్లో ఏ చుక్కల్లో ఉన్నావో’ అంటూ రాసిన స్మృతిగీతం చాలా ప్రచారం పొందింది.
పక్షవాతం వచ్చి మంచానబడ్డ చివరి రోజుల్లో సైతం యెడమ చేత్తో పలకమీద ప్రజల పాట రాయడానికి తపించాడని అతని భార్య హేమగారు చెప్పిన మాటలు తెలంగాణ తెచ్చిన పాట కు కష్టం లో ఉన్నప్పుడు ఏ అధికారం సహాయం చేయలేదు అని అన్నారు చివరివరకూ పాట నే శ్వాసించి పాటనే ఆచరించిన తన నిబద్ధతకి నిలువెత్తు సాక్ష్యాలు తాను రాసిన పాటలే .
పిడికిలి బిగించే విశ్వవిద్యాలయాలు వెలివాడలుగా మారినప్పుడు వర్ణ వివక్ష కి బలైన రోహిత్ వేముల కు జై భీములన్నాడు ఒక రచయిత రాజీ పడటమంటే ..తన ఆత్మని అమ్ముకోవడమే అని జీవితాంతం విశ్వసించి ఆచరించిన అంజన్న తెలంగాణా సొంత రాష్ట్రంలో దొరల గడీలు గులాబీ రంగేసుకోవడాన్ని కూడా ప్రశ్నించాడు. ప్రజాస్వామ్యం ముసుగేసుకొన్న పాలకుల దొరతనపు పోకడల్ని అసహ్యించుకొని సామాజిక తెలంగాణా రాలేదని బాధపడ్డాడు.
కొత్త రాష్ట్రం యేర్పడి రెండేళ్ళయినా స్వపరిపాలనలో సైతం ప్రజా సమస్యలు యెందుకు పరిష్కారం కావడం లేదు – ‘సేను వాయె – సెలుక వాయె , బతుకు వాయె – మెతుకు వాయె , గొడ్డు వాయె – గోద వాయె , వలస బోయి బతుకుడాయె’ అని తాను యేళ్ళ తరబడి పాడిన పాతపరిస్థితులే ఎందుకున్నాయి అని పాలకుల్ని ప్రత్యక్షంగా కలిసి నిలదీయాలనుకొన్నాడు. కానీ ..రాజ్యాన్నేలే దొరని చూడటం ఫాం హౌస్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం సాధ్యం కాలేదు ఆయన చివరి కోరిక అని కొందరు అపార్థం చేసుకున్నారు. కానీ దోర కడిగేద్దమని కసి తో ఉన్నాడని ఇంటర్వ్యూ లో తన ఆవేదన వ్యక్తం చేశారు
ఊరున్నంత కాలం ,వాడ వున్నంత కాలం ఊరూ వాడల్ని విడదీసే దొరలున్నంత కాలం దొంగతనాలు వున్నంతకాలం అంజన్న పాటకి ప్రాసంగికత వుంటుంది. పాటతో దొర పీఠాలు కుదిపినందుకే యేలిన వారికి ప్రజా వాగ్గేయ కారుడి మరణం అల్పవిషయంగా తోచింది. చివరి చూపులక్కూడా దొర రాకపోవడమే అంజన్న విజయం. అదే అతని గౌరవాన్ని ఇనుమడింపజేసింది. ఎత్తిన తల దించకుండా పోయేలా చేసింది. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా అతను చేసిన పోరాటాలని పదికాలాల పాటు గుర్తుంచుకొనేలా చేసింది. కుల మత వర్గ ఆధిపత్యాలను తొలగించే నూతన ప్రజాస్వామిక విప్లవంలో కొనసాగడమే అంజన్న ద్వారా మనం పొందాల్సిన స్ఫూర్తి. అతను అమర కళాకారుడు,యుగకవి జోహార్లు అంజన్న