ఘనంగా స్వామి వివేకానంద జయంతి
జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూ శాయంపేటలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.న్యూ శాయంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాన్ని ప్రజాసేవ సమితి ఫౌండేషన్ చైర్మన్,బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత శ్రీ వేల్పుల వేణు గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ వేల్పుల సారంగపాణి యాదవ్ మాట్లాడుతూ..స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడని అన్నారు.1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.ప్రతి మనిషిలో దైవత్వం ఉందని,దానిని వెలికితీయడమే జీవిత లక్ష్యమని స్వామిజీ బోధించారని తెలిపారు.యువత శారీరక,మానసిక దృఢత్వంతో పాటు ఏకాగ్రత,ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన సూచనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.“జీవ సేవే శివ సేవ”అనే సిద్ధాంతంతో సేవా భావనకు కొత్త నిర్వచనం ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,యువత,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.స్వామిజీ ఆదర్శాలను అనుసరించి యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శీలం చంద్రపాల్,సత్తు శ్యామ్,మంద రాజు,రాజారపు కిరణ్,పెరుగు సురేష్,రామ్మూర్తి,వెనుకంటి చందర్,వేల్పుల సురేందర్,వేల్పుల శ్రీధర్,నీరటి విష్ణు,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.