పండుగ పూట పస్తులేనా? ప్రభుత్వానికి పట్టింపులేదా?
కాంట్రాక్టు-ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి
-సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందక పండుగ రోజుల్లో కూడా పస్తులు ఉండాల్సి వస్తుందా? దీనిపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదా? అంటూ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలో రాపర్తి రాజు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు-ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తామని,మధ్యదలారి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.ఫలితంగా నెలల తరబడి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదన్నారు.జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది పేర్లు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో పది నెలలుగా వేతనాలు నిలిచిపోయాయని తెలిపారు.మల్టీ పర్పస్ వర్కర్లకు రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని,స్టేషన్ ఘనపూర్ నూతన మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి గత ఆరు నెలలుగా బడ్జెట్ మంజూరు కాలేదనే కారణంతో వేతనాలు చెల్లించలేదన్నారు.అలాగే ఎంసీహెచ్ చంపకిల్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు-ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.ఇదే పరిస్థితి ఇతర శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కొనసాగుతుండటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని తీవ్రంగా విమర్శించారు.పర్మినెంట్ ఉద్యోగుల కంటే ఎక్కువ శ్రమ చేస్తున్న కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు.వీరికి పీఎఫ్,ఈఎస్ఐ,ప్రమాద బీమా,గుర్తింపు కార్డులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టర్ల దోపిడీకి అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలన్నారు.సంక్రాంతి పండుగను ఈ ఉద్యోగులు సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు.లేనిపక్షంలో వేతనాల సమస్య పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని రాపర్తి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.