మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్144 అమలు : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా,స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొననున్న పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రాముఖ్యత, విధుల నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, చేయాల్సినవి – చేయకూడనివి అంశాలపై అడిషనల్ ఎస్పీ సమగ్రంగా వివరించారు.భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని, ఇందుకోసం 26 లొకేషన్లలో 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల భద్రత కోసం మొత్తం 450 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ సామాగ్రి తరలింపును సురక్షితంగా నిర్వహించేందుకు 8 రూట్లలో పటిష్ట ఎస్కార్ట్‌తో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.ప్రతి రెండు రూట్లకు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్‌ను, ప్రతి నాలుగు రూట్లకు డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదనంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, సీఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ఎస్ఐల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ టీమ్స్, రూట్ మొబైల్స్, బ్లూ కోర్ట్స్‌ను కూడా మోహరించినట్లు తెలిపారు.ఈ భద్రతా ఏర్పాట్లలో ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు. ఎన్నికల రోజున మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు, ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్‌లలో సెల్ఫీలు దిగడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని, ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.