భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రశాంతంగా పోలింగ్
భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల, హనుమాన్ నగర్‌లోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా సందర్శించి పోలింగ్ ఏర్పాట్లు, ఓటింగ్ విధానం, భద్రతా చర్యలను సమీక్షించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడి ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు.భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 52,726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. వీరిలో 26,786 మంది పురుషులు, 25,936 మంది మహిళలు, 4 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. మొత్తం 30 వార్డులకు గాను 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణ కోసం 104 మంది ప్రెసైడింగ్ అధికారులు, 104 మంది అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులు, 312 మంది ఇతర పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి,వెబ్‌కాస్టింగ్ ద్వారా జరుగుతున్న ప్రత్యక్ష పర్యవేక్షణను పరిశీలించారు. మొత్తం 86 పోలింగ్ కేంద్రాల్లో 149 వెబ్‌కాస్టింగ్ యూనిట్ల ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.కొన్ని కేంద్రాల్లో లోపల మరియు బయట భాగాల్లో వేర్వేరుగా వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు.పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతోందని, స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.