
ఈ69న్యూస్ జనగామ/చిల్పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరగాల్సిన శ్రీరామనవమి వేడుకలు ఉద్రిక్తతలకు దారితీశాయి. శ్రీ సీతారామచంద్రస్వామి ఊరేగింపులో కాంగ్రెస్–బిఆర్ఎస్ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారితీయగా, ఇదే ఘటనలో సర్పంచ్ కుటుంబ సభ్యులపై దాడి ఆరోపణలు కూడా వెల్లువెత్తడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
*ఊరేగింపులో రగడ*
శుక్రవారం రాత్రి స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు సందర్భంగా నిర్వహణపై తలెత్తిన వివాదం కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మాట మాట పెరిగి పరస్పర దాడుల వరకు వెళ్లింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
*సర్పంచ్,తన తమ్ముడు,అనుచరుడిపై ఆరోపణలు*
ఇదే సమయంలో గ్రామ సర్పంచ్‌కు ప్రధమ పౌరుడిగా ఆహ్వానం ఇవ్వలేదనే ఆవేదనతో, సర్పంచ్ తమ్ముడు రత్నాకర్ రెడ్డి,మరో వ్యక్తి గ్రామానికి చెందిన శ్యాం బాబు పై దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.గ్రామంలో గత కొంతకాలంగా పండుగలు, శుభకార్యాలు నిర్వహిస్తున్న శ్యాం బాబు పై దాడి జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.శ్యాం బాబు మీడియాతో మాట్లాడుతూ..శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం రాత్రి సర్పంచ్ ఎనుగందుల నర్సింహా రెడ్డి, ఆయన తమ్ముడు కరుణాకర్ రెడ్డి కలిసి తమపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
*సర్పంచ్ వివరణ..*
ఈ ఆరోపణలను సర్పంచ్ ఎనుగందుల నరసింహారెడ్డి ఖండించారు. తనను పిలవకపోయినా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయానని తెలిపారు.తను వెళ్లిన తర్వాత జరిగిన ఘటనలతో తనకు సంబంధం లేదని, సాయంత్రం ఘర్షణ జరుగుతోందని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించానని చెప్పారు.తాను దాడిలో పాల్గొన్నట్లు వస్తున్న ఆరోపణలు అసత్యమని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో పార్టీల తేడా లేకుండా అందరికీ సేవలు అందిస్తున్నానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారని పేర్కొన్నారు.
*పోలీస్ స్టేషన్‌కు చేరిన వివాదం*
ఘర్షణల నేపథ్యంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.ఈ ఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.గ్రామంలో ఉద్రిక్తత
పవిత్రమైన శ్రీరామనవమి వేడుకల్లో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భక్తి వాతావరణంలో జరగాల్సిన ఉత్సవాలు రాజకీయ, వ్యక్తిగత వివాదాలకు వేదిక కావడం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.