
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ మార్చి 28:
స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని మీదికొండ గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో శనివారం 5 ఎంవిఎ సామర్థ్యం కలిగిన అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్ఈ చెరుకు సంపత్ రెడ్డి మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ఈసారి వేసవికాలం ప్రారంభానికి ముందుగానే విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగినా, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా అందిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే ఉన్న పిటిఆర్‌కు అనుసంధానంగా మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల్లో లో వోల్టేజ్, ఓవర్‌లోడ్ సమస్యలు తగ్గనున్నాయని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఉపకేంద్రం నుంచి తాటికొండ 33/11 కేవీ ఉపకేంద్రానికి కూడా విద్యుత్ సరఫరా అందించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో విద్యుత్ సరఫరాను నిర్వహిస్తున్నామని, దీనికి కింది స్థాయి అధికారులు, సిబ్బంది కృషి కారణమని అభినందించారు. విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉండి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
అలాగే పనుల్లో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని, వినియోగదారులకు కూడా భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని వినియోగదారులను కోరారు.
ఈ కార్యక్రమంలో డిఈ ఆపరేషన్ బి. సారయ్య, డిఈ/ఎంఆర్టి విజయ్ కుమార్, ఏడిఈ పాల్వాయి రణధీర్ రెడ్డి, ఏఈలు పి. శంకర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.