జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు
ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశంలో కీలక ఆదేశాలు
బ్లాక్ మార్కెటింగ్,అక్రమ నిల్వలపై కఠిన చర్యలు–ఇప్పటికే 19 కేసులు నమోదు
వదంతులను నమ్మొద్దు–ప్రజలకు ఎస్పీ సంకీర్త్ సూచన
భూపాలపల్లి జిల్లాలో గ్యాస్,పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని,ఎలాంటి కొరత పరిస్థితి లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.శనివారం ఐడీఓసీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సంకీర్త్తో కలిసి ఆయన సరఫరా పరిస్థితులపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నిత్యావసర ఇంధనాల సరఫరా పటిష్టంగా కొనసాగుతోందని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాలని, వాటిని వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.జిల్లాలో సుమారు లక్షా 20 వేల గ్యాస్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు.సంక్షేమ వసతి గృహాలు,పాఠశాలలు,ఆసుపత్రులకు గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని,ఆయా శాఖల అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల బుకింగ్ సైకిల్ అమలులో ఉందని, బుకింగ్ క్రమం ప్రకారమే సిలిండర్ సరఫరా జరుగుతోందని వెల్లడించారు.డెలివరీ సమయంలో ఓటీపీ విధానం తప్పనిసరిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఇటీవలి కాలంలో గ్యాస్ బుకింగ్లు ఒక్కసారిగా పెరగడం వల్ల డిమాండ్ అధికమవుతోందని గుర్తించిన కమిటీ, ప్రజలు అవసరానికి మించి బుకింగ్ చేయకుండా, నిల్వలు చేయకుండా ఉండాలని సూచించింది.పాఠశాలలు,హాస్టళ్లలో ఎల్పీజీ వినియోగంపై సంబంధిత అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.పెట్రోల్, డీజిల్ సరఫరాపై కూడా సమీక్షిస్తూ, అత్యవసర సేవలకు ఎప్పటికప్పుడు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని,వాహనాల తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ అధికారులను ఆదేశించారు.జిల్లాలో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్,అనధికార రీఫిల్లింగ్ కేంద్రాలపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ఇప్పటికే 19 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.హోటళ్లు,ధాబాల్లో అక్రమంగా వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని నిత్యావసర వస్తువుల చట్టం–1955 సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.అక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు నిరంతర తనిఖీలు,పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.సరఫరాలో పారదర్శకత,సమయానుకూల నివేదికలు సమర్పించాలని సూచించారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ,పెట్రోల్,డీజిల్,గ్యాస్ డీలర్లతో ఇప్పటికే సమావేశం నిర్వహించామని తెలిపారు.సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నందున ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు.పెట్రోల్ బంకులు,గ్యాస్ గోదాముల వద్ద పటిష్ట నిఘా కొనసాగుతోందని వెల్లడించారు.ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖల అధికారులు, హెచ్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ అమర్త్యదాస్ తదితరులు పాల్గొన్నారు.