

ఈ69న్యూస్ పర్వతగిరి మార్చి 30
వరంగల్ జిల్లా పర్వతగిరి సర్కిల్ ఆఫీస్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లలో హెవీ మరియు ట్రాన్స్పోర్ట్ వాహన డ్రైవర్ల కోసం సోమవారం రోజు ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొని తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు.దీర్ఘకాలం డ్రైవింగ్ చేసే డ్రైవర్లకు కంటి చూపు ఎంతో కీలకమని, కంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు వివరించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు, సూచనలు కూడా అందజేశారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి సీఐ బి. రాజగోపాల్, ఎస్సై బి. ప్రవీణ్ పాల్గొని డ్రైవర్లకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు.అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం ఎంత ముఖ్యమో వివరించారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.