ఓటరు జాబితా శుద్ధికి రాజకీయ పార్టీల సహకారం అవసరం
భూపాలపల్లి జిల్లాలో త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు.మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఆయన, ఓటరు జాబితా ప్రక్షాళన ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడం అవసరమని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకూడదని సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి బూత్ స్థాయి అధికారి (బి ఎల్ ఓ) తమ పరిధిలోని ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి,ఓటర్ల వివరాలను ఖచ్చితంగా సేకరించి సరిదిద్దే ప్రక్రియను చేపడతారని తెలిపారు.కొత్తగా అర్హత పొందినవారిని ఓటరుగా నమోదు చేయడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లను తొలగించడం వంటి చర్యలు ఈ సర్వేలో భాగంగా ఉంటాయని వివరించారు.ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తుందని, ప్రకటించిన వెంటనే పూర్తి వివరాలను రాజకీయ పార్టీలకు తెలియజేస్తామని తెలిపారు.ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి, తదుపరి ప్రజల నుండి అభ్యంతరాలు మరియు సూచనలు స్వీకరించి,అవసరమైన మార్పులు చేసి తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి, బీఎల్ఓలకు సహకరించడం ద్వారా ఈ ప్రక్రియను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా శుద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.జిల్లాలోని అర్హులైన ప్రతి పౌరుడు తమ పేరు ఓటరు జాబితాలో ఉన్నదీ లేదీ తప్పనిసరిగా పరిశీలించుకుని,అవసరమైన సవరణలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.