పాలన పేపర్లకే పరిమితం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ గ్రామం,రేగొండ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాశ్ రెడ్డి, ప్రజాపాలన అబ్జర్వర్ హుస్సేన్ బాబా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో గ్రామస్థులతో కలిసి రాష్ట్ర గీతాన్ని ఆలపించడం ద్వారా సభను ప్రారంభించారు.అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రూపొందించిన అవగాహన వీడియోను ప్రదర్శించి గ్రామస్థులతో కలిసి వీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రత్యేక అధికారులు చదివి వినిపించగా, వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా లబ్ధి పొందిన ప్రయోజనాలు, అమలు చేస్తున్న పథకాల వివరాలను గ్రామసభలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, “పాలన అనేది కేవలం పేపర్లపైనే ఉండే ప్రక్రియ కాదు, అది ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపించాలి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి పథకం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి” అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 28 నెలల కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం మాత్రమే కాకుండా,వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టబడిందని వివరించారు.ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయి నుండి అభివృద్ధి ప్రారంభమవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సేవలు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం వంటి కీలక పథకాలను ఆయన వివరించారు.అదేవిధంగా రానున్న రోజుల్లో అమలు చేయనున్న పథకాల గురించి కూడా విశదీకరించారు. విద్యార్థుల పోషకాహారం కోసం పాఠశాలల్లో అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బీమా పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వెనుకడుగు ఉండదని స్పష్టం చేశారు.రేగొండ మండల సభలో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ,డిబిఎం-38 కాలువను రామప్ప చెరువు నుంచి వరంగల్ వైపు వెళ్లే దేవాదుల ప్రాజెక్టు పైప్‌లైన్‌తో అనుసంధానం చేసే ప్రతిపాదనను వివరించారు.ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తపల్లి గోరి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల పరిధిలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.46 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు.ఈ పనులకు అవసరమైన నిధులను వచ్చే వారంలో సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ ప్రాజెక్టు అమలు ద్వారా రైతులకు సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.అలాగే ప్రాంతీయ ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని తెలంగాణలో మరో యాదాద్రి స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించామని తెలిపారు.నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను అన్ని దిశల్లో అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.రైతుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ,భూపాలపల్లి డీఈ మాట్లాడుతూ నూతన విద్యుత్ కనెక్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ విధానం ద్వారా విద్యుత్ వినియోగదారులకు సేవలు మరింత సులభతరం అయ్యాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా అందిస్తున్న సదుపాయాలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డులో గ్రామసభలు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ గ్రామసభలు ప్రజలకు తమ సమస్యలను అధికారులకు తెలియజేసే వేదికగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్య శిబిరాలు, రహదారి భద్రత, సంక్షేమ పథకాల అమలు, మత్తు పదార్థాల నివారణ, ఉపాధి అవకాశాలు, క్రీడల అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ సేవలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వం ప్రజలతో నేరుగా మమేకమై సమస్యల పరిష్కారం, అభివృద్ధి సాధన దిశగా ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు.