పాలన ప్రజల జీవితాల్లో ప్రతిఫలించాలి–ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్థులతో నేరుగా మమేకమయ్యారు.ఈ కార్యక్రమం ప్రారంభంలో గ్రామస్థులతో కలిసి రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రూపొందించిన అవగాహన వీడియోను ప్రదర్శించి గ్రామ ప్రజలతో కలిసి వీక్షించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రత్యేక అధికారులు చదివి వినిపించగా, వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా లబ్ధి పొందిన ప్రయోజనాలను గ్రామసభలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, “పాలన అనేది కేవలం పేపర్లపైనే ఉండకూడదు, అది ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపించాలి” అని పేర్కొన్నారు.ప్రభుత్వం ఏర్పడిన 28 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే కాకుండా,వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయి నుండి అభివృద్ధి జరగాలని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సేవలు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం వంటి కీలక పథకాలను వివరించారు. రానున్న రోజుల్లో బీమా పథకాలు, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఉమ్మడి రేగొండ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించిన ఆయన, డిబిఎం-38 కాలువను రామప్ప చెరువు నుంచి వరంగల్ వైపు వెళ్లే దేవాదుల ప్రాజెక్టు పైప్‌లైన్‌తో అనుసంధానం చేసే ప్రతిపాదనను వివరించారు.ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తపల్లి గోరి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల పరిధిలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.46 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ పనులకు అవసరమైన నిధులను త్వరలోనే సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని తెలంగాణలో మరో యాదాద్రి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రధాన రహదారులను అన్ని దిశల్లో అభివృద్ధి చేస్తూ రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ, భూపాలపల్లి డీఈ నూతన విద్యుత్ కనెక్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.ఈ విధానం ద్వారా రైతులు సులభంగా విద్యుత్ కనెక్షన్లు పొందే అవకాశం కలుగుతుందని, ప్రజలు 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నడిపెల్లి శాంతాదేవి–వెంకట్రావు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓ రాంప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శి గోపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉప సర్పంచ్ కొట్టాల శ్రీకాంత్,వార్డు మెంబర్లు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వం ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు.