పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు
బాధితులుకు బంగారు ఆభరణాలు అందజేస్తున్న ఏ ఎస్ ఐ.మనోహర్ రావు పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని గణ్య తండాకు చెందిన అనిత, రవికుమార్ దంపతులు తమ ఇంట్లో పోగొట్టుకున్న బంగారాన్ని పర్వతగిరి పోలీసులు శ్రమించి రికవరీ చేసి, బాధితులకు విజయవంతంగా అప్పగించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పర్వతగిరి సబ్ ఇన్స్పెక్టర్ భోగం ప్రవీణ్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏఎస్సై మనోహర్ రావు ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ యూసుఫ్ బాధితుల ఇంట్లోనే క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. లోతైన విచారణ అనంతరం పోగొట్టుకున్న తోమ్మిది తులాల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ రోజు పర్వతగిరి పోలీస్ స్టేషన్లో రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అధికారికంగా అందజేశారు. పోగొట్టుకున్న సొత్తును తక్కువ సమయంలోనే కనుగొని తమకు అప్పగించినందుకు బాధితులు పర్వతగిరి ఎస్ఐ ప్రవీణ్, ఏఎస్సై మనోహర్ రావు, హెడ్ కానిస్టేబుల్ యూసుఫ్ మరియు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమర్థవంతంగా పనిచేసి బంగారాన్ని అప్పగించిన పోలీస్ అధికారులను స్థానికులు అభినందించారు.