కల్తీ ఎరువులు, విత్తనాల విక్రయాలను అరికట్టాలి
మండలంలోని రైతులకు కల్తీ లేని, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలని హెచ్చరించింది.రైతు సంఘం మండల కార్యదర్శి నక్క యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించే వ్యాపారులపై మండల వ్యవసాయ అధికారి (ఏవో) కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతే దేశానికి వెన్నెముక అని చెప్పే ప్రభుత్వాలు రైతులపై అదనపు భారం మోపడం దురదృష్టకరమన్నారు.మద్దతు ధరలు పెంచకుండా ఫర్టిలైజర్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాయపురం బిక్షపతి, రాజు, రామస్వామి, కనకయ్య, నాయకులు నీరాటి కొమరయ్య, ఎర్ర రవి, జల్లెల్ల శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు.