ప్రమాదకర రహదారికి శుభ పరిష్కారం – ప్రయాణికుల ప్రశంసలు
తిమ్మంపేట – వెంకటాపురం రహదారిపై ఎన్నో రోజులుగా ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ సైడ్ పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తూ స్థానికులు ముందుకొచ్చారు. ఈ సేవా కార్యక్రమాన్ని తాండ్ర చిట్టిబాబు మరియు శెట్టిపల్లి మల్లికార్జునరావు స్వచ్ఛందంగా, తమ సొంత ఖర్చులతో చేపట్టడం విశేషం.
ఈ రహదారి ద్వారా తిమ్మంపేట నుంచి వెంకటాపురం మీదుగా బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాలకు ప్రజలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. అయితే రహదారి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారం కారణంగా మూలమలుపుల వద్ద రోడ్ కనిపించక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ సమస్యను గుర్తించిన తాండ్ర చిట్టిబాబు, శెట్టిపల్లి మల్లికార్జునరావు జేసీబీ సహాయంతో రోడ్డుకి ఇరువైపులా మొక్కలను తొలగించి, రహదారిని శుభ్రపరిచారు. గుండాలపాడు క్రాస్ రోడ్ నుంచి వెంకటాపురం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ పనులు నిర్వహించారు.
ఇక ముందు ఈ సీజన్లో మొక్కలు మరింతగా పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంపై స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ, “శభాష్” అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.