సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ముగింపు
సింగరేణి కాలరీస్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఎండిఓఎఐ) సత్తుపల్లి శాఖ ఆధ్వర్యంలో అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా కొనసాగిన రిలే నిరాహార దీక్షలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. అధికారుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంతో దీక్షలను విరమించినట్లు సిఎండిఓఎఐ నాయకులు తెలిపారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు సింగరేణి సంస్థ అభివృద్ధిలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వ చొరవతో నిరసన కార్యక్రమం విజయవంతంగా ముగియడం పట్ల సిఎండిఓఎఐ సత్తుపల్లి కమిటీ ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది.
ఈ ఉద్యమానికి అండగా నిలిచిన అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ), భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఎస్సీ–ఎస్టీ అసోసియేషన్, బీసీ–ఓబీసీ సంక్షేమ సంఘం, డ్రైవర్ల సంఘం, లేడీస్ క్లబ్ సభ్యులు, సేవా సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే అధికారుల డిమాండ్లను ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ముద్రిత, దృశ్య మాధ్యమాల ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా సింగరేణి సంస్థ అభివృద్ధికి, అధికారుల సంక్షేమానికి అందరి సహకారం కొనసాగాలని సిఎండిఓఎఐ సత్తుపల్లి శాఖ ఆకాంక్షించింది