ఈ నెలాఖరు నాటికి వైద్య కళాశాల భవన పనులు పూర్తి కావాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల (మెడికల్ కాలేజ్) భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి, పూర్తిస్థాయిలో అప్పగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో ఆర్ అండ్ బీ, వైద్య కళాశాల,టీజీఎంఐడీసీ అధికారులతో కళాశాల నిర్మాణ ప్రగతిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఇంకా పెండింగ్లో ఉన్న మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని,రోజువారీ ప్రగతిని పర్యవేక్షిస్తూ పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.కళాశాల భవనంతో పాటు విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, అంతర్గత రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్యం వంటి అత్యవసర మౌలిక సదుపాయాలను సమయానికి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.సంబంధిత ప్రభుత్వ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే విద్యార్థుల హాస్టల్ భవన నిర్మాణ పనులను కూడా రాబోయే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పక్కాగా పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ రమేష్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర రావు, కేపీసీ ప్రత్యేక ఇంజినీర్ శివరామ్, ఇతర విభాగాధికారులు పాల్గొన్నారు.