సీతక్కను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు
ములుగు రైతులను మోసం చేసింది బీఆర్ఎస్… రైతులకు అండగా నిలిచింది మంత్రి సీతక్క
ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు మంత్రి సీతక్క అహర్నిశలు కృషి చేస్తున్నారని, అలాంటి నాయకురాలిపై విమర్శలు చేసే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావుకు లేదని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ తీవ్రంగా విమర్శించారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు, ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముశినేపల్లి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భానోత్ రవిచందర్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో, చెరువుల్లో ఉన్న నీటిని సంరక్షించి రైతుల పంటలకు, ప్రజలకు తాగునీటికి ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందన్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలుమార్లు చర్చించి, చెరువుల ద్వారా నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తుంటే, వాటినే నమ్మి హరీష్ రావు కూడా అసత్య ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అసత్యాలతో రాజకీయాలు చేస్తే ప్రజల ఎదుట నవ్వులపాలు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో ములుగు రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ సమయంలో ములుగు నియోజకవర్గ రైతుల అవసరాలను పట్టించుకోకుండా సిద్ధిపేట, సిరిసిల్ల వంటి ప్రాంతాలకు నీటిని మళ్లించి, ములుగు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి సీతక్క ములుగు రైతుల ప్రయోజనాలనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారని, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ములుగు మండలం పొట్లాపూర్ ప్రాంతంలో సుమారు రూ.140 కోట్ల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ములుగు ప్రాంత రైతులకు సాగునీటి సమస్య గణనీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నారని, అలాంటి నాయకురాలిపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పంచాయతీ రాజ్ స్టేట్ డైరెక్టర్లు బైరెడ్డి భగవాన్ రెడ్డి, గుమ్మడి సోమయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు పల్లె జైపాల్ రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, చైర్మన్లు, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.