డంపింగ్ యార్డు కోసం జారీ చేసిన జీవో 641ను వెంటనే రద్దు చేయాలి
రాజకీయాలకు అతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు
సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 641ను తక్షణమే రద్దు చేయాలని సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 2న సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు జీవో 641ను జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర రాజకీయ పార్టీలు విడివిడిగా ఆందోళనలు చేపడుతున్నాయి.అయితే ఈ పోరాటాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధుల అభిప్రాయాల మేరకు “సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ”ని ఏర్పాటు చేశారు.ఈ జేఏసీ తొలి సమావేశం మంగళవారం షాద్‌నగర్‌లోని దేవి గ్రాండ్ హోటల్లో చైర్మన్ రాంబాల్ నాయక్ అధ్యక్షతన జరిగింది.సమావేశంలో కమిటీ నిర్మాణంలో స్వల్ప మార్పులు చేస్తూ పలు తీర్మానాలు చేశారు.ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసేందుకు డంపింగ్ యార్డు ప్రభావం పడే గ్రామాలు, మండలాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలను ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా జేఏసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ రాంబాల్ నాయక్ మాట్లాడుతూ, ఒకప్పుడు పచ్చని పంట పొలాలు, కూరగాయల సాగుతో హైదరాబాద్ నగరానికి ఆహారం అందించిన ఈ ప్రాంతం డంపింగ్ యార్డు కారణంగా కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. స్వచ్ఛమైన గాలి, తాగునీరు, ప్రశాంతమైన జీవన విధానం దెబ్బతింటుందని, సిద్ధాపూర్ మాత్రమే కాకుండా సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలన్నీ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని జీవో 641 రద్దు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జేఏసీ సలహాదారులు వంగూరి గంగిరెడ్డి, అబ్దుల్ రబ్ జామి, వర్కింగ్ చైర్మన్ దొడ్డి శ్రీనివాస్ (బీఎస్పీ), కన్వీనర్ పినపాక ప్రభాకర్, కో-ఆర్డినేటర్లు తిరుమలయ్య, టీజీ శ్రీనివాస్, కో-చైర్మన్లు సత్యనారాయణ (బీఆర్ఎస్), మోహన్ సింగ్ (బీజేపీ), బుద్దల జంగయ్య (సీపీఐ), ఈశ్వర్ నాయక్ (సీపీఎం), పెంటనోళ్ల నరసింహ (ఎంఆర్పీఎస్), బొజ్జ శ్రీనివాస్ రెడ్డి, బాలస్వామి, రజిత, కో-కన్వీనర్లు అర్జున్, రవీంద్రనాథ్, ప్రశాంత్, వి. శ్రీకాంత్, పవన్, సత్యనారాయణ, వరప్రసాద్, బిత్యా నాయక్, శ్రీధరాచారి తదితరులు పాల్గొన్నారు.