పరిశుభ్రత,చెత్త వర్గీకరణపై అవగాహన
:పరిశుభ్రత,చెత్త వర్గీకరణపై అవగాహన
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
కొత్తపల్లి గోరి మండల పరిధిలోని రామగుండాలపల్లి గ్రామంలో గురువారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వైద్యాధికారి డాక్టర్ దీప్తి, గ్రామ సర్పంచ్ ఏడెల్లి మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారి దీప్తి మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వాడి పడేసిన టైర్లు, పగిలిన కుండలు, కూలర్లు, కొబ్బరి చిప్పలను తొలగించడం లేదా బోర్లించి పెట్టడం చేయాలన్నారు.నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని కోరారు.అనంతరం సర్పంచ్ ఏడెల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామస్తులందరూ తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఇంట్లో వెలువడే వ్యర్థాలను నాలుగు రకాలుగా విభజించి గ్రామపంచాయతీ సిబ్బందికి అందజేయాలని సూచించారు. కూరగాయలు, ఆహార వ్యర్థాల వంటి భూమిలో కరిగిపోయే వాటిని తడి చెత్తగా, తిరిగి వినియోగించుకునే ప్లాస్టిక్ వ్యర్థాలను పొడి చెత్తగా, చిన్నపిల్లలు, వ్యాధిగ్రస్తులు వాడే మెడికల్ వ్యర్థాలను సానిటరీ చెత్తగా, అలాగే గాజు పదార్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, పాత సెల్ ఫోన్లను ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన చెత్తగా వేర్వేరు బుట్టల్లో సేకరించాలని వివరించారు.ఇదే క్రమంలో ఎల్-నీనో ప్రభావంతో వర్షపాతం తగ్గే సూచనలు ఉన్నందున రైతులు దానికి అనుగుణంగా పంట ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు.ప్రతి రైతు తమ వ్యవసాయ భూమిలో ఒక పంట కుంట (ఫామ్ పాండ్) నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మడప విష్ణువర్ధన్ రెడ్డి, గుడికందుల విష్ణు, శిరీష, వనజ, పంచాయతీ కార్యదర్శి నరేశ్,అంగన్వాడీ కార్యకర్త సుమలత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మధుకర్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.