
జనగామ, ఫిబ్రవరి 25
వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన (PMDDKY) కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి చిన్మయ్ పి. గోట్మారే బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
జనగామ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. పింకేష్ కుమార్ జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుండి పాల్గొన్నారు. ఆరు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అమలు పురోగతి, మండలాల వారీ లక్ష్య సాధన, డ్యాష్‌బోర్డ్‌లో నమోదైన భౌతిక–ఆర్థిక ప్రగతిపై సమగ్రంగా చర్చించారు.
పంటల ఉత్పాదకత పెంపు, సుస్థిర వ్యవసాయ విధానాలు, రైతులకు సులభ రుణ సదుపాయాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, సమగ్ర నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార, భూగర్భ జలాలు, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖల అధికారులు, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పి. పింకేష్ కుమార్ మాట్లాడుతూ, జనగామ జిల్లాను PMDDKY అమలులో ఆదర్శ జిల్లాగా నిలబెట్టేందుకు శాఖల సమన్వయంతో లక్ష్యాలను సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.