అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు న్యాయవాదుల నిరాహార దీక్ష
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బార్ అసోసియేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆత్మగౌరవం,సమిష్టి భద్రత,హక్కుల పరిరక్షణ లక్ష్యంగా “అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్”ను వెంటనే చట్టసభల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు బార్ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు న్యాయవాదులు స్వచ్ఛందంగా కోర్టు విధులను బహిష్కరించి ఆందోళనకు సంఘీభావం తెలిపారు.ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కాంప్లెక్స్ ఎదుట ఈ నిరాహార దీక్ష ప్రారంభమైంది.గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదులపై చోటుచేసుకుంటున్న భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తూ,న్యాయవాదుల భద్రతకు చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని కోరారు.న్యాయవాదులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు,వృత్తి నిర్వహణలో భద్రత కల్పించేందుకు సమగ్ర చట్టం అవసరమని వారు పేర్కొన్నారు.తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ మార్గదర్శకాల మేరకు భవిష్యత్ కార్యాచరణను కొనసాగిస్తామని సంఘం నాయకులు తెలిపారు.న్యాయవాదుల గౌరవం, భద్రత కాపాడడం న్యాయవ్యవస్థ బలపాటుకు అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వళబోజు శ్రీనివాస చారి, జనరల్ సెక్రటరీ వి. శ్రవణ్ రావు, వైస్ ప్రెసిడెంట్ బల్ల మహేందర్, ట్రెజరర్ మంగళపల్లి రాజ్‌కుమార్, లేడీ జాయింట్ సెక్రటరీ ప్రియాంక, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఇందారపు శివకుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రేగుల రాకేష్, వేషాల రవీందర్, నీలం ప్రశాంత్, లేడీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కనపర్తి కవిత, కందుల సుధరాణి, సీనియర్ న్యాయవాదులు కూనూరు సురేష్, పంచగీరి బిక్షపతి, పగడాల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.జిల్లాలోని పలువురు న్యాయవాదులు భారీ సంఖ్యలో హాజరై ఆందోళనకు మద్దతు తెలిపారు.